: శ్రీలంక శాపనార్థాలు..!


తమ దేశంలో జరిగే కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి హాజరుకానివారు ఒంటరైపోతారని శాపనార్థాలు పెడుతోంది శ్రీలంక. విషయం ఏమిటంటే.. మరి కొద్దిరోజుల్లో శ్రీలంకలో కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మనదేశం తరపున ప్రధాని మన్మోహన్ పాల్గొనాలి. అయితే, శ్రీలంకలో తమిళుల ఊచకోతకు నిరసనగా మన ప్రధాని శ్రీలంక సమావేశానికి హాజరు కారాదని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కోరుతున్నారు. దీంతో, కామన్వెల్త్ సమావేశానికి హాజరవ్వాలా? వద్దా? అనే విషయంలో మన కేంద్ర ప్రభుత్వం ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదు. ఈ నేపథ్యంలో, శ్రీలంక హైకమిషనర్ ప్రసాద్ కరియవాసమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి హాజరుకాని వారు ఏకాకిలా మిగిలిపోతారని అన్నారు.

ఇది రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సమావేశం కాదని... మొత్తం కామన్వెల్త్ దేశాలు పాల్గొనే సమావేశమని కరియవాసమ్ తెలిపారు. మన్మోహన్ భారత్ ప్రధానే కాదు... ప్రపంచ కీలక నేతల్లో ఒకరని... ఆయన విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు. తాము మన్మోహన్ ను వ్యక్తిగతంగా కలసి సదస్సుకు ఆహ్వానించామని... ఇలా మరే నేతనూ ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. అయితే, శ్రీలంకకు ఇప్పటికే ఒక షాక్ తగిలింది. అదేంటంటే, కెనడా ప్రధాని ఈ సమావేశానికి హాజరు కావడంలేదంటూ ప్రకటించేశారు. దీనిపై కరియవాసమ్ వ్యాఖ్యానిస్తూ... కెనడాలోని తమిళులు ఆయన మనసు మార్చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News