: విభజనపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చెప్పాం: సీమాంధ్ర నేతలు
రాష్ట్ర విభజనపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని గవర్నర్ నరసింహన్ తో చెప్పామని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తెలిపారు. అయితే, ఎలాంటి ప్యాకేజీలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ టూర్ లో ఉన్న రాష్ట్ర గవర్నర్ ను సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ ఉదయం కలిశారు. విభజనపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను వివరించారు. అనంతరం, నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ విభజనకు అంగీకరించినందునే ముందుకు వెళుతున్నామని అధిష్ఠానం చెబుతోందన్నారు. కానీ, రాజకీయ లబ్ది కోసమే విభజన జరుగుతోందని తాము భావిస్తున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన తర్వాతే విభజనపై ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రధానికి వివరించాలని గవర్నర్ ను కోరినట్లు సీమాంధ్ర నేతలు వెల్లడించారు.