: మిస్ న్యూజెర్సీగా ఎంపికైన భారత సంతతి యువతి
మిస్ అమెరికాగా ఎంపికైన నీనా దావులూరి అడుగుజాడల్లో మరో భారత సంతతి అమెరికా వనిత ప్రయాణిస్తోంది. 2014 సంవత్సరానికి గానూ జరిగిన మిస్ న్యూజెర్సీ పోటీలో భారత సంతతి వనిత ఎమిలీ షా (18) విజయపతాకాన్ని ఎగరేసింది. మిస్ న్యూజెర్సీ కాంటెస్ట్ లో 130 మంది సుందరాంగులు పోటీపడగా... వారిలో ఎమిలీ కిరీటాన్ని దక్కించుకుంది. దీంతో, ఈమె 2014 సీజన్ కు గానూ జరిగే మిస్ అమెరికా టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఎమిలీ షా ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో సందడి చేసింది. హాలీవుడ్ లో నసీరుద్దీన్ షా నటించిన 'ది గ్రేట్ న్యూ వండర్ ఫుల్' సినిమాలో కనిపించింది. అలాగే బాలీవుడ్ లో ఔట్ ఆఫ్ కంట్రోల్, తా రా రం పం, జానేమన్ సినిమాల్లో నటించింది. ఎమిలీ తండ్రి ప్రశాంత్ షా బాలీవుడ్ సినీ నిర్మాణంలో షారూక్, కరణ్ జోహార్, రాకేష్ రోషన్ లాంటి వారితో కలసి పనిచేస్తున్నారు.