: రాహుల్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న బీజేపీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న అల్లర్ల బాధితులతో.. పాకిస్థాన్ ఐఎస్ఐ అధికారులు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని రిక్రూట్ చేసుకునేందుకు యత్నిస్తున్నారని తమకు సమాచారముందని నిన్న ఇండోర్ లో జరిగిన ఓ సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఐఎస్ఐ వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలుంటే బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయమై మాట్లాడుతూ, రాహులేమీ ప్రధాని కాదని, మరలాంటప్పుడు ఆయనకు నిఘా వర్గాల నుంచి ఎలా సమాచారం అందుతుందని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో మతకల్లోలాలు ఎగసిపడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ తన వ్యాఖ్యలపై ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని సమాజ్ వాదీ పార్టీ స్పష్టం చేసింది.