: యువతలో కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువట!
ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే పక్షవాతం ఇప్పుడు యువకులు, మధ్య వయసువారిలో ఎక్కువగా కనిపిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పక్షవాతం కేసులు 25 శాతం ఎక్కువగా 20 నుండి 64 ఏళ్ల వారిలోనే నమోదవుతున్నాయని, మొత్తం పక్షవాతం కేసుల్లో 31 శాతం మంది ఈ వయసు వారే ఉంటున్నట్టు లాన్సెట్ వైద్య పత్రికలో ప్రచురితమైన గ్లోబల్ అండ్ రీజినల్ బర్డెన్ ఆఫ్ స్ట్రోక్ ఇన్ 1999`2010 అధ్యయనం పేర్కొంది.
పక్షవాతం మూలంగా వచ్చే వైకల్యం, అకాల మరణాలు 2030 నాటికి రెట్టింపు కావచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది. 20 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసుగల వారిలో ఏటా 83,000 మంది పక్షవాతం బారిన పడుతున్నారని ఈ అధ్యయనం వివరించింది. పక్షవాతం బారిన పడుతున్న వారిలో ఎక్కువమంది అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే కావడం గమనార్హం. మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల వచ్చే పక్షవాతం కేసులు 19 శాతం పెరిగాయని, ప్రమాదకరమైన ఇలాంటి పక్షవాతం చాలా వరకూ అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన జీవనశైలి మూలంగా వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పక్షవాత మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం 59 లక్షలకు అనగా 26 శాతానికి ఎగబాకటం గమనార్హం.