: వచ్చేనెల 6 నుంచి 24 వరకు రచ్చబండ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విభజనపై అధిష్ఠానం కోరినంతనే ఆగమేఘాలమీద రోడ్ మ్యాప్ అందజేసిన ముఖ్యమంత్రి, విభజన ప్రకటన తర్వాత తాను సమైక్యవాదినంటూ కొత్త పల్లవి అందుకున్నారు. సమైక్యవాదం అండగా మొన్న ఫైలిన్ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈసారి వరద చుట్టుముట్టడంతో 'రచ్చబండ'కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఓ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రచ్చబండ నిర్వహించనున్నారని, వచ్చే నెల 6 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు రచ్చబండ జరుగుతుందని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.