: రెణ్ణెల్లపాటు రూమ్మేట్ కు టీ పెట్టి ఇచ్చిన సచిన్
సచిన్ టెండూల్కర్ మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవనుండడంతో మాజీలందరూ తమ జ్ఞాపకాల దొంతరలను విప్పుతున్నారు. బ్యాటింగ్ దిగ్గజంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతున్నారు. అలనాటి లెగ్ స్పిన్నర్ నరేంద్ర హిర్వాణీ కూడా మాస్టర్ తో మధుర క్షణాలను మీడియాతో పంచుకున్నాడు. తొలిసారి సచిన్ ను 1987లో ఓ శిక్షణ శిబిరంలో చూశానని చెప్పాడు. కోచ్ వసు పరంజపే సచిన్ బ్యాటింగ్ పాటవం గురించి ఎంతో చెప్పాడని, నెట్స్ లో అతని ఆటతీరు చూస్తే అది నిజమేననిపించిందని హిర్వాణీ తెలిపాడు.
ఆ శిబిరం అనంతరం సచిన్, తానూ ఇంగ్లండ్ టూర్ కు వెళ్ళామని, అక్కడ 72 రోజుల పాటు రూమ్మేట్స్ గా ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో 62 రోజులు సచిన్ తనకు టీ పెట్టి ఇచ్చాడని చెబుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఓసారి సచిన్ తో మాట్లాడుతూ, 'నీకు ఓ 70 ఏళ్ళ పాటు టీ పెట్టి ఇస్తా' అని చెప్పానని తెలిపాడు. ఇక, సచిన్ నెట్స్ లో ప్రాక్టీసు చేసేటప్పుడు చుట్టూ ఫీల్డర్లు ఉన్నట్టుగానే భావించి నైపుణ్యానికి మెరుగులు దిద్దుకునేవాడని హిర్వాణీ వెల్లడించాడు. అప్పట్లో సచిన్ కు బౌలింగ్ చేయడం ఓ సవాల్ అని అభిప్రాయపడ్డాడు.