: కోర్టు తీర్పుతో సమసిన రూ. 20 వేల కోట్ల ఆస్తి వివాదం
దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి తెగకుండా ఉన్న ఓ ఆస్తి వివాదం సమసిపోయింది. ఈ వివాదం విలువ అక్షరాలా రూ. 20 వేల కోట్లు. స్వతంత్ర భారతావనిలో జరిగిన అతిపెద్ద సెటిల్ మెంట్లలో ఇది ఒకటిగా నిలిచింది. మన దేశంలోని అత్యంత సుసంపన్నమైన రాచరిక వ్యవస్థల్లో ఒకటిగా వెలిగిన... గుజరాత్ లోని వడోదర రాజకుటుంబానికి చెందిన ఆస్తి వివాదం ఇది. వడోదర జిల్లా కోర్టు సమక్షంలో గైక్వాడ్ రాజ కుటుంబానికి చెందిన యువరాజు సమర్ జిత్ సిన్హా, అతని సమీప బంధువు సంగ్రామ్ సిన్హా ఒక రాజీకొచ్చారు.
రాజీ ప్రకారం.. వడోదరలో ఉన్న లక్ష్మీనివాస్ ప్యాలెస్, దాని చుట్టూ ఉన్న 600 ఎకరాల విలువైన స్థలం సమర్ జిత్ సిన్హాకు చెందుతుంది. దీంతోపాటు, ప్యాలెస్ లోని మ్యూజియంలో ఉన్న విలువైన పెయింటింగ్ లు, వజ్రాలు, విలువైన ఇతర వస్తువులు కూడా ఇతనికే చెందుతాయి. ఇక, వడోదరలోని ఇందుమతి మహల్ తో పాటు మరికొన్ని విలువైన ఆస్తులు సంగ్రామ్ సిన్హాకు చెందుతాయి. వీటితో పాటు ముంబైలోని ఒక విలువైన స్థలం ఈయనకు దక్కుతుంది. దీంతోపాటు, రాజ కుటుంబం అధీనంలో ఉన్న కొన్ని వ్యాపారాలు ఇతని సొంతం కానున్నాయి. రాజీ అనంతరం సంతోషంగా ఉన్నామని... భవిష్యత్తులో కూడా ఆత్మీయతానురాగాలతో మెలుగుతామని తెలిపారు.