: తనకన్నా విద్యాధికురాలని భార్యను కడతేర్చాడు
భార్య తనకన్నా విద్యాధికురాలు అవబోతోందన్న అహంభావం ఆ లెక్చరర్ లో విచక్షణను చంపేసింది. పర్యవసానం, ఆ విద్యాకుసుమం ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకెళితే.. బెంగళూరు బసవేశ్వరనగర్ లో నివాసముండే సంతోష్ కుమార్, ప్రీతా భార్యాభర్తలు. ఎనిమిది నెలల క్రితం వారికి పెళ్ళయింది. సంతోష్ కుమార్ (32) నడిగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అతడి విద్యార్హత.. బీఈ.
ఇక, అతడి భార్య ప్రీతా (29) ఎంటెక్ పూర్తి చేయాలని సంకల్పించింది. దాంతో, సంతోష్ లో అహం బుసలు కొట్టింది. ఈ విషయమై భార్యను హెచ్చరించాడు. ఎంటెక్ వద్దంటూ గద్దించాడు. కానీ, ప్రీతా నిరాకరించడంతో గడ్డపలుగుతో ఆమె తలను చితక్కొట్టాడు. దీంతో, ఆమె అక్కడిక్కడే మరణించింది. ఇది చూసి సంతోష్ పరారయ్యాడు. ప్రీతా తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ ను అరెస్టు చేశారు.