: ఆ ఉత్తరాలన్నీ గాంధీజీకే..
జాతిపిత మహాత్మాగాంధీ కొత్త చిరునామా ఏంటో తెలుసా?.. గాంధీజీ @ మహాత్మాగాంధీ రోడ్, బెంగళూరు-1. విషయం ఏమిటంటే.. బెంగళూరులో మహాత్మాగాంధీ రోడ్ ఒకటి ఉంది. ఇక్కడ కొత్తగా ఒక పోస్ట్ బాక్స్ ను తపాలాశాఖ ఏర్పాటు చేసింది. అయితే, స్థానిక రంగోలీ మెట్రో ఆర్ట్ సెంటర్ వారికో వినూత్నమైన ఆలోచన వచ్చింది. నెల రోజుల పాటు ఆ పోస్ట్ బాక్స్ లో పడే ఉత్తరాలన్నీ జాతిపిత గాంధీని ఉద్దేశించినవే అయివుండాలని వారు భావించారు. అనుకున్నదే తడవుగా ఆ సంస్థకు చెందిన వాలంటీర్లు ఖాళీ కార్డులతో పోస్ట్ బాక్స్ పక్కనే తిష్ఠ వేశారు.
అక్కడకు ఎవరు వచ్చినా వారి చేతిలో ఓ ఖాళీ పోస్ట్ కార్డు పెట్టి గాంధీకి లేఖ రాయండంటూ ప్రోత్సహిస్తున్నారు.
'గాంధీజీ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నన్ను మీరు కలుస్తారా?' ఒక అభిమాని రాసిన లేఖ ఇది.
'డియర్ మహాత్మాగాంధీ.. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో మీరెంతో ఉత్తములు..' ఇది మరో వ్యక్తి రాసిన లేఖ.
నవంబర్ తొలి వారంలో ఈ ఉత్తరాలన్నింటినీ ప్రదర్శించనున్నారు. కాగా, రంగోలీ మెట్రో ఆర్ట్ సెంటర్ క్యూరేటర్ సురేఖ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ రోడ్డులోని ఈ పోస్ట్ బాక్స్ లో పడే తొలి ఉత్తరం గాంధీకే వెళ్ళాలని తాము భావించామని తెలిపారు. తమ కాన్సెప్ట్ గాంధీజీ పట్ల చాలామందిలో ఆలోచన రేకెత్తిస్తుందని అనుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.