: హైదరాబాద్ లో భార్య, కొడుకును కడతేర్చిన కసాయి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి కసాయిగా మారాడు. కిరాయి హంతకులతో కలసి కట్టుకున్న భార్య, కన్నకొడుకును కడతేర్చాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి జరిగింది. హంతకుడు గుర్రం శశిధర్ రెడ్డి రియలెస్టేట్ బ్రోకర్. 1996లో విజయలక్ష్మిని పెళ్లిచేసుకున్న అతను తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత మే నెలలో భర్తపై విజయలక్ష్మి వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దాంతో, పోలీసులు శశిధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో భార్యపై అతను కక్ష పెంచుకున్నాడు.
ప్రస్తుతం విజయలక్ష్మి తన కుమారుడు సాకేత్ రెడ్డితో కలసి నాగోల్ ప్రాంతంలో నివాసముంటోంది. నిన్న అర్ధరాత్రి 9 గంటల సమయంలో కిరాయి హంతకులను వెంటబెట్టుకుని వచ్చిన శశిధర్... తన భార్య, కుమారుడిపై తల్వార్లతో దాడిచేసి హత్య చేశాడు. పక్కనే ఉన్న వారి బంధువు సంధ్య కేకలు వేయడంతో కిరాయి హంతకుల్లో ఇద్దరు పారిపోయారు. మూడో వ్యక్తి మధుసూదన్ రావును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాత్రూంలో దూరి తలుపువేసుకున్న శశిధర్ రెడ్డిని పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో... శశిధర్ రెడ్డి కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. కిరాయి హంతకులు వరంగల్ జిల్లా తొర్రూరు ప్రాంతవాసులుగా పోలీసులు గుర్తించారు.