: ఒక టీకాతో రెండు జబ్బుల నివారణ!
ఒక జబ్బుకోసం వైద్యం చేయించుకుంటే మరో జబ్బు కూడా నయం కావడం మనం చూస్తేనే ఉన్నాం. అలాగే ప్లూవ్యాధి నివారణకు టీకా వేయించుకుంటే ఆ టీకా ఇన్‌ఫ్లూయెంజా మూలంగా వచ్చే తీవ్ర సమస్యల బారినపడకుండా చూడడమే కాకుండా గుండెజబ్బుల బారినపడిన వారికి కూడా ఎంతగానో ఉపకరిస్తుందని తేలితే... సరిగ్గా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ప్లూ వ్యాధికొరకు వేసే టీకా గుండెజబ్బుల బారిన పడినవారిలో పక్షవాతం, గుండెపోటు ముప్పును సగానికిపైగా తగ్గిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజా పరిశోధనల్లో ప్లూ టీకా వేసుకుంటే గుండెజబ్బుల బారిన పడినవారిలో పక్షవాతం, గుండెపోటు ముప్పులను తగ్గిస్తున్నట్టు తేలింది. మరింత శక్తిమంతమైన టీకాను తీసుకున్న వారికి ఈ రక్షణ మరింత ఎక్కువగా లభిస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జేకబ్ ఉడెల్ మాట్లాడుతూ గుండె జబ్బుగలవారికి ప్లూ టీకా గుండెపోటు రాకుండా కాపాడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. అయితే గుండెపోటు ముప్పును తగ్గించే చికిత్సగా ప్లూ టీకాను ఇవ్వవచ్చో లేదో అనే విషయంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఉడెల్ చెబుతున్నారు.