: చెట్లకు బంగారం కాస్తుందట!


బంగారం ఎక్కడ దొరుకుతుంది? అంటే ఏం చెబుతాం... ఎక్కడ దొరుకుతుందో శాస్త్రవేత్తలు తగిన పరిశోధనలు చేసి తెలుసుకుంటారు. దీనికి బోలెడు సమయం, వ్యయం ఖర్చవుతాయనుకుంటున్నారా... అలా కాకుండా తక్కువ ఖర్చుతో భూమిలో ఉండే బంగారాన్ని గుర్తించవచ్చట. ఎలాగా అంటున్నారా... ఆ ప్రాంతాల్లో ఉండే చెట్లను పరిశీలించడం ద్వారా... అదేంటి చెట్లేమన్నా బంగారాన్ని కాస్తాయా... అంటున్నారా... నిజంగానే బంగారాన్ని కాస్తాయి. చెట్లకు బంగారమే కాస్తుంది. ఎందుకంటే అవి భూమిలో ఉండే బంగారాన్ని పీల్చుకుంటాయి కాబట్టి వాటి ఆకుల్లో కూడా బంగారం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు యూకలిప్టస్‌ చెట్లలో సూక్ష్మమైన బంగారు రేణువులు ఉండడాన్ని తమ పరిశోధనలో గుర్తించారు.

ఈ విషయాన్ని గురించి కామన్వెల్త్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో)కు చెందిన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భూమిలోపల బంగారు ఖనిజాలు ఉన్న చోట్లలో పెరిగే చెట్లు కరవు సమయాల్లో తేమకోసం నీటిలో ఉండే బంగారాన్ని కూడా పీల్చుకుంటాయని వెల్లడించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కలగూర్లీ ప్రాంతంలో ఉన్న చెట్లలో బంగారాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న బంగారం రేణువుల విశ్లేషణ కోసం సీఎస్‌ఐఆర్‌వోకు చెందిన మయూ డిటెక్టర్‌ను ఉపయోగించారు.

సీఎస్‌ఐఆర్‌వోకు చెందిన జియోకెమిస్ట్‌ మెల్విన్‌ లింటెర్న్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని తాము ఊహించలేదని, చెట్ల ఆకుల్లో బంగారు రేణువుల్ని గుర్తించడం నిజంగా అద్భుతంగా అనిపించిందని చెబుతున్నారు. యూకలిప్టస్‌ చెట్లు హైడ్రాలిక్‌ పంప్‌లాగా వ్యవహరిస్తాయని, చెట్ల వేర్లు మీటర్లకొద్దీ భూమిలోపలికి వెళ్లి బంగారంతో కూడిన నీటిని లాగేస్తాయని, నీటిద్వారా వచ్చే బంగారం ఆకులు, కొమ్మలకు చేరి, బయటికి విడుదల కావడంగానీ, లేదా నేలపై పడిపోవడంగానీ జరుగుతుందని తెలిపారు.

బంగారు నిక్షేపాలున్న చోట పెరిగే 500 చెట్లనుండి ఒక పెళ్లి ఉంగరానికి సరిపడే బంగారాన్ని పొందవచ్చని, భూమిలోపల ఎలాంటి నిక్షేపాలున్నాయనే సంగతిని డ్రిల్లింగ్‌ జరపకుండా బయో జియోకెమికల్‌ శాంప్లింగ్‌ ప్రక్రియ ద్వారా గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ఫలితంగా ఖనిజాల అన్వేషణలో వ్యయాలను తగ్గించుకోవడం, పర్యావరణంపై దుష్ప్రభావాలు లేకుండా చూసేందుకు చక్కగా ఉపకరిస్తుందని, జింకు, రాగి వంటి ఇతర ఖనిజాలను గుర్తించేందుకు సైతం ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News