: పార్టీలు మారడం నేతలకు సహజమే: ఎంపీ లగడపాటి
తెలంగాణపై ఎస్సార్సీ అనేది కాంగ్రెస్ విధానమని, ఈ విషయంలో అధిష్ఠానం తన వైఖరిని మార్చుకోలేదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రం విషయంలో ఏకాభిప్రాయం కుదిరితేనే విభజిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారని లగడపాటి గుర్తు చేశారు. కానీ, ఏకాభిప్రాయం ఎప్పటికీ సాధ్యం కాదన్న ఆయన, ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలంగాణతో పాటు విదర్భ కావాలని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గంకు చెందిన కొంతమంది తెలుగుదేశం నేతలను లగడపాటి ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ లో చేర్పించారు. అనంతరం లగడపాటి మాట్లాడుతూ, ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి నేతలు మారడం సహజమేనన్నారు. అయితే కృష్ణా జిల్లా నుంచి కాంగ్రెస్ నేతలెవరూ రాజీనామా చేయలేదన్నారు. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేస్తే తక్షణమే ఆమోదించాలని కోరారు.