: ఆ మూడు పార్టీలను భూస్థాపితం చేస్తేనే న్యాయం జరుగుతుంది: బాబు
రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలను భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కాంగ్రెస్ నేత కృష్ణమోహన్ సహా 50 మంది బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించే ఎవరైనా పార్టీలోకి రావచ్చని చెప్పారు. తాను రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంతా దోచుకున్నారని మండిపడ్డారు. అన్ని సంక్షేమ పథకాలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలోనే అత్యాచారాలు జరుగుతుంటే, అసలు, ప్రభుత్వం ఉందా? లేదా? అని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేసే సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందని బాబు ఉద్ఘాటించారు.