: రాష్ట్రంలో వాన బీభత్సం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఈశాన్య రుతుపవనాలు కూడా ప్రభావం చూపడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వర్షాల ధాటికి పలు వాగులు, రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నాయి. గుండ్లకమ్మ రిజర్వాయర్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో ఆరు గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మద్దిరాలపాడు వద్ద గుండ్లకమ్మ చప్టాపై ఐదడుగల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో, అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.

ఒంగోలు పట్టణంలో 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లోకి నీరు ప్రవేశించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కందుకూరులో కరెంటు స్థంభాలు నేలకొరిగాయి. వేటపాలెం, సంతరావూరు నడుమ ముసలమ్మ కాలువ వంతెన నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఇక, ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. వంశధార కుడిగట్టు కాలువకు గండి పడి శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కొన్ని గ్రామాలు జలమయమయ్యాయి. విజయనగరం జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలోనూ వర్షం కారణంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News