: ఆ స్థానం నాదే: రైనా
టీమిండియాలో సుస్థిర స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా ఏమంటున్నాడో వినండి. జట్టులో నెంబర్ 4 స్థానం కోసం పోటీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ డౌన్ పై తన మోజును చాటుకున్నాడు. ఆ స్థానం తనదేనన్నాడు. ఇటీవలే కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ, నెంబర్ 4 స్థానంలో రైనానే సరి అని పేర్కొన్న సంగతి తెలిసిందే. యువీకే తొలి ప్రాధాన్యం ఇస్తానని, అయితే, అతను వరల్డ్ కప్ నాటికి జట్టులో ఉండే విషయంలో స్పష్టత లేదన్నాడు. అందుకే, రైనాను ఇప్పటి నుంచే నెంబర్ 4 స్థానంలో ఆడించాలని భావిస్తున్నామని ధోనీ వివరించాడు.
ఈ నేపథ్యంలో రాంచీలో రైనా మీడియాతో మాట్లాడుతూ, 'ఆసీస్ తో గత రెండు మ్యాచ్ లలో రాణించలేదు. అయినా, నెంబర్ 4 స్పాట్ నాదే. ఆ స్థానంలో ఇంతకుముందు రాణించాను' అని చెప్పుకొచ్చాడు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వస్తుండగా, వన్ డౌన్లో విరాట్ కోహ్లీ బరిలో దిగుతున్నాడు. ఇక సెకండ్ డౌన్ లో దిగే బ్యాట్స్ మన్ (నాలుగోస్థానంలో) జట్టుకు మూలస్థంభంలా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకే ఆ స్థానం అంత కీలకంగా కనిపిస్తోంది. మరోవైపు, ధోనీనే ఆ స్థానానికి అతికినట్టు సరిపోతాడని మాజీ క్రికెటర్లంటున్నారు.