: హైదరాబాద్ లో బయటపడ్డ 400 ఏళ్లనాటి సొరంగం... నిధులున్నాయంటూ పుకార్లు
హైదరాబాద్ ఆల్వాల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పక్కన సొరంగం బయటపడింది. గుడికి ఆనుకుని ఉన్న స్థల యజమాని అందులో నిర్మాణాన్ని చేపట్టడానికి పునాది కోసం తవ్వకాలు ఆరంభించాడు. కానీ, ఆశ్చర్యకరమైన రీతిలో అక్కడ ఓ బావితో పాటు, సొరంగం బయటపడింది. ఈ సొరంగం 400 ఏళ్ల క్రితం నిర్మించినదని స్థానికులు భావిస్తున్నారు. ఇందులో భారీ స్థాయిలో నిధి, నిక్షేపాలు ఉండవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. సొరంగాన్ని చూడటానికి ఈ ప్రాంతానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. రాచరిక పరిపాలన ఉన్న రోజుల్లో ఈ సొరంగాన్ని తవ్వించి ఉంటారని భావిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయని... ఈ చారిత్రక ఆధారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.