: అమ్మపాలు అమృతమే కదా...
అమ్మపాలతో సమానమైనది ఈ భూమిపై మరేదీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, తల్లిపాలు తాగడం వల్ల బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విషయం ఎన్నో పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, తల్లిపాలు తాగడం వల్ల అలాంటి బిడ్డల్లో హెచ్‌ఐవీ వ్యాధి వచ్చే అవకాశం కూడా తక్కువని తేలింది. ప్రస్తుతం మానవాళిని భయపెట్టే వ్యాధుల్లో హెచ్‌ఐవీ ఒకటి. దీన్ని నివారించడానికి తగు ఔషధాన్ని మాత్రం శాస్త్రవేత్తలు ఇంతవరకూ కనుగొనలేకపోయారు. ఇలాంటి భయంకరమైన వ్యాధిని తల్లిపాలల్లో ఉండే ఒక రకమైన ప్రోటీను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సదరు హెచ్‌ఐవీ వైరస్‌ను అచేతనంగా మారుస్తున్నట్టు పరిశోధకులు తమ పరిశోధనల్లో గుర్తించారు.
తల్లిపాలల్లో ఉండే టెనాస్కిన్-సి (టీఎన్‌సీ) గా వ్యవహరించే ఒకప్రోటీను తల్లినుండి హెచ్‌ఐవీ వైరస్ బిడ్డలకు సోకకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు తొలిసారిగా గుర్తించారు. ఈ ప్రోటీను గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గతంలో గుర్తించినా సూక్ష్మజీవుల నిరోధక లక్షణాలు ఉన్నట్టు గతంలో వెల్లడికాలేదు. అయితే డ్యూక్ విశ్వవిద్యాలయ వైద్యకేంద్రం పరిశోధకులు తల్లిపాలల్లోని టీఎన్‌సీ ప్రోటీన్ హెచ్‌ఐవీ వైరస్‌ను పట్టుకొని అచేతనంగా మారుస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రోటీను శిశువులను వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తున్నట్టు వీరు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు.
తల్లినుండి బిడ్డకు వైరస్ సోకకుండా అడ్డుకునేందుకు కొన్ని ఔషధాలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల అవసరం ఉందనీ, ఈ నేపధ్యంతో తమ పరిశోధన ముఖ్యమైనదని ఈ పరిశోధనలో పాల్గొన్న సాల్లీ పెర్మార్ చెబుతున్నారు. హెచ్‌ఐవీ వైరస్‌ను నిర్మూలించే దిశగా టీఎన్‌సీకి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నట్టు, తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన విషయాలతో హెచ్‌ఐవీ నివారణ దిశగా కొత్త పరిశోధనలకు ముందుకు సాగేందుకు అవకాశం ఉందని తాము భావిస్తున్నామని పెర్మార్ చెబుతున్నారు.