: టీనేజ్‌లోనే అందానికి ప్రాధాన్యత


టీనేజ్‌ అంటే చదువుకునే వయసులో అందానికి అందరూ చాలా ప్రాధాన్యతనిస్తారు. ఎప్పుడూ అద్దం ముందేనా...ఇంట్లో పనిచేయవా... అంటూ అమ్మలు కసురుకోవడం మనం చాలా ఇళ్లలో వింటూవుంటాం. ఇలా చదువుకునే సమయంలో అద్దంముందునుండి కదిలేందుకు ఇష్టపడని అమ్మాయిలు పెద్దయిన తర్వాత, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో చేరిన తర్వాత అదే అద్దాన్ని పది నిమిషాలకంటే ఎక్కువసేపు పట్టుకోలేరట. ఈ విషయం నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది.

అంటే అలంకరణకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడంలేదట. లండన్‌కు చెందిన కొందరు నిపుణులు నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వేలమంది ఉద్యోగినులలో డెబ్భైశాతం మంది యువతులు అలంకరించుకోవడానికి పది నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించడం లేదని తేలింది. మారుతున్న జీవనశైలే దీనికి కారణమని తేలింది. ఉద్యోగం వల్ల పెరిగిన బాధ్యతల కారణంగా ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం, పార్టీలకు హాజరు కావడం, షాపింగులకు వెళ్లడం వంటి పలు కారణాల వల్ల దాని ప్రభావం నిద్రపై పడుతుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల దాని ప్రభావం ఉదయాన్నే కనిపిస్తుంది. ఉదయం ఆలస్యంగా లేవడం, ఆఫీసుకు టైమైపోతోందనే హడావిడిగా తయారవడం, పరుగులు తీయడం ఇలాంటి కారణాలవల్ల అలంకరించుకోవడానికి తగిన సమయం తగ్గిపోయిందని పలువురు చెబుతున్నారు.

మరికొందరైతే చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను తీసుకుని ఆ బాధ్యతలకు తగినట్టుగా హుందాగా ఉండాలనే ఉద్దేశ్యంతో మేకప్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిపారట. ఇలాంటి వారంతా కేవలం పార్టీలు, పండుగలు వంటి సందర్భాల్లో మాత్రమే ప్రత్యేకంగా అలంకరించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు. అయినా ప్రతిరోజూ ఇలా తీరిక లేకుండా పోతున్నా వారానికి కనీసం ఒక్కరోజైనా మీ సౌందర్య పోషణకు కేటాయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News