: రాహుల్ పై కేసు దాఖలు చేయనున్న బీజేపీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై భోపాల్ కోర్టులో బీజేపీ కేసు దాఖలు చేయనుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా తెలిపారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని షాడోల్ వద్ద నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్.. గిరిజనులపై అమర్యాదపూర్వకమైన వ్యాఖ్యలు చేశారని ప్రభాత్ ఆరోపించారు. అందుకే రాహుల్ పై ఈ రోజే రెండు కేసులు దాఖలు చేయాలని పార్టీ భావిస్తోందని చెప్పారు. ఈనెల 17న ఆ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో.. ఓ గిరిజన మహిళతో రాహుల్ మాట్లాడిన విధానం అత్యంత అభ్యంతరకరంగా ఉందన్నారు. అందుకే ఓ పరువునష్టం దావా కేసు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ నివారణ చట్టం కింద మరో కేసు దాఖలు చేస్తామని చెప్పారు.