: సినీ హీరోను రూ. 50 లక్షలకు ముంచిన కేసులో ఇద్దరి అరెస్టు
తనను మోసం చేసి రూ. 50 లక్షలు కాజేశారని ముంబైలోని ఓ కమోడిటీ ట్రేడింగ్ ఫర్మ్ 'ఇంటెక్ ఇమేజ్'పై బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేసును నమోదు చేసుకున్న ముంబై ఆర్థిక నేరాల విభాగానికి చెందిన పోలీసులు... ఇంటెక్ ఇమేజ్ అధినేత సత్యబ్రత చక్రవర్తితో పాటు అతని భార్య సోనాను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
తాను పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు మొత్తాన్ని కేవలం 45 రోజుల్లో తిరిగి చెల్లిస్తామని ఇంటెక్ సంస్థ యజమాని చెప్పారని అక్షయ్ ఖన్నా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అక్షయ్ డబ్బుతో ఇంటెక్ సంస్థకు లాభాలు వచ్చాయా? లేక నష్టాలు మూటగట్టుకుందా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులకు... నిందితుల నుంచి సరైన సమాధానం లభించలేదని సమాచారం. అక్షయ్ ను మోసం చేసిన వారి వద్ద నుంచి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.