: రాబోయే ఎన్నికల్లో హీరో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతివ్వనున్నాడా?
రాబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులకు నాంది పలకనున్నాయా? దీనికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీన్ని బలపరుస్తూ ఈమధ్యే పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. ఈ వార్త టీడీపీలో కూడా కలకలం రేపినట్టు చెబుతున్నారు. పవన్ సోదరుడు నాగబాబు కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వినిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ కు దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో, ఈ వర్గానికి చెందిన నేతలు నాగబాబు తో చర్చలు జరిపినట్టు సమాచారం.
పవన్ మొదటి నుంచి కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణతో పాటు పవన్ ఫోటో ఉన్న ప్లెక్సీలు కూడా వెలిశాయి. దీంతో పవన్ కల్యాణ్ తెదేపాకు మద్దతు పలుకుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతుందన్నది త్వరలో తెలుస్తుంది!