: రాయలసీమ గురించి ఎవరైనా ఆలోచించారా?: సాయిప్రతాప్
విభజన నేపథ్యంలో రాయలసీమ గురించి ఎవరైనా ఆలోచించారా? అని ఎంపీ సాయిప్రతాప్ సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాయలసీమకు చిన్నతరహా ప్రాజెక్టులు కూడా వచ్చేట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనాలోచిత నిర్ణయమన్నారు. ప్రజలు లేకుండా, ప్రజల ప్రమేయం లేకుండా తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వస్తాయని పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పారని, అయితే ఇప్పుడది పూర్తయ్యే అవకాశం కనబడడం లేదని ఆయన అన్నారు. తాను మరోసారి రాజీనామా చేశానని, తన రాజీనామాపై పునరాలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనని ఆయన తెలిపారు. కలిసి ఉండగా అధికంగా నష్టపోయింది తామేనని, అలాంటిది తామే కలిసుండాలని కోరుతున్నామని సాయిప్రతాప్ డిమాండ్ చేశారు.