: 'ఆంధ్రప్రదేశ్ అవతరణ' నాడు సమైక్యత కోసం మానవహారాలు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా సమైక్యరాష్ట్రాన్ని కోరుతూ మానవహారాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. హైదరాబాదు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వేదిక సమన్వయకర్తలు వి.లక్ష్మణ రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిపోయిందని కొందరు కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని, అసెంబ్లీని, పార్లమెంటును అవమానపరిచేలా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను వేదిక ఖండిస్తోందని వారు తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వారు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్టేనన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలు మాని ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని నడిపించాలని ఆయన కోరారు. అన్ని జేఏసీలతో సంప్రదించి సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.