: కుమారమంగళం బిర్లాపై బొగ్గు కేసుకు మంగళం!


ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారమంగళం బిర్లాపై మోపిన బొగ్గు కేసుకు సీబీఐ మంగళం పాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీబీఐ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఒడిశాలోని తాలాబిర-2 బొగ్గు గనిని బిర్లాకు చెందిన హిందాల్కోకు కేంద్ర బొగ్గు శాఖ కేటాయించడంలో అక్రమాలు జరిగాయన్నది సీబీఐ ఆరోపణ. ఈ నేపథ్యంలో నాడు బొగ్గు శాఖ కార్యదర్శిగా పనిచేసిన పరేఖ్ తోపాటు, కుమారమంగళం బిర్లాపై కేసు నమోదు చేసింది. దీనిని దేశీయ పారిశ్రామిక వేత్తలతోపాటు కేంద్ర మంత్రులు సైతం తప్పుబట్టారు.

పరేఖ్ మాత్రం నాటి నిర్ణయం సరైనదేనన్నారు. తాను తప్పు చేస్తే ఆ గని కేటాయింపు ఫైలుపై సంతకం పెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా నేరస్తుడు అవుతారని, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును కూడా చేర్చాలన్నారు. దీంతో హిందాల్కోకు తాలాబిర బొగ్గు గని కేటాయింపు సరైనదేనని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో బిర్లాపై కేసును ఎత్తివేయాలని సీబీఐ భావిస్తోంది. నేరుగా మూసివేయకుండా అందరితో సంప్రదించి చేయాలని భావిస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఎఫ్ఐఆర్ అనేది కేసులో ప్రాథమిక చర్యగా పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News