: ప్రేమంటే... ఇదేరా...!


ప్రేమంటే... ఏమో... దాన్ని సరిగ్గా నిర్వచించి చెప్పడం కష్టం. తమ భర్తలు తాము అడిగిన బట్టలు, నగలు వంటివి కొనిస్తే వారికి తమపై ఎక్కువ ప్రేమ ఉందని చాలామంది మగువలు అనుకుంటుంటారు. ఒకవేళ అదే నిజమైన ప్రేమే అయితే, ఈయనగారి ప్రేమ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఆయన తన భార్యకు బోలెడు డ్రస్సులను కొనిపెట్టాడు. ఎన్ని డ్రస్‌లు అంటే వేలల్లో ఉన్నాయి. అన్ని డ్రస్‌లన్నమాట! ఎప్పుడైనా తాము అడిగిన చీర లేదా డ్రస్‌ను కొనివ్వడానికి డబ్బు లేదనో, లేదా ఇప్పుడు కాదనో మీ భర్తలు చెబుతారేమో. కానీ పాల్‌ బ్రాక్‌మన్‌ మాత్రం తన భార్య అడగకున్నా అన్ని డ్రస్సులను చక్కగా కొనిపెట్టాడట.

గత 56 ఏళ్లలో పాల్‌ బ్రాక్‌మన్‌ తన భార్య మార్గోట్‌కు బోలెడు డ్రస్‌లు కొనిపెట్టాడట. ఎన్ని డ్రస్‌లు అంటే 55 వేల డ్రస్‌లు. అంటే రోజుకు సరాసరి రెండుకన్నా ఎక్కువే కొన్నాడన్నమాట. జర్మనీనుండి ఉపాధికోసం అమెరికా వచ్చిన పాల్‌ తొలిదశలో నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేశాడు. తర్వాత పెద్ద స్థాయి కంట్రాక్టర్‌గా ఎదిగాడు. తన భార్యతో కలిసి ప్రతివారం బాల్‌రూం డాన్సింగ్‌కు వెళ్లడం పాల్‌కు అలవాటు. అయితే ప్రతివారం తన భార్య కొత్త దుస్తుల్లో తనతో డాన్స్‌ చేయాలని ఆయన కోరిక. అంతే... ఇక అప్పటినుండీ తన భార్యకోసం కొత్త కొత్త డ్రస్‌లను కొనడం మొదలుపెట్టాడు. ఇలా ఆయన కొన్న డ్రస్‌లను పెట్టడానికి ఒక ప్రత్యేకమైన రూంని కేటాయించాల్సి వచ్చిందట. పోనీ ఇకనైనా ఆపాడా అంటే లేదు. ఇంకా కొంటూనే ఉన్నాడట. మొత్తానికి పాల్‌ బ్రాక్‌మన్‌ నిజంగా భలే భర్త... కదూ...!!

  • Loading...

More Telugu News