: మీరెంత కొవ్వు కరిగించారో ఇది చెబుతుందట!


పెరిగిన బరువును తగ్గించుకోవడానికి లేదా తీరైన శరీరాకృతిని కాపాడుకోవడానికి మనలో చాలామంది వ్యాయామానికి ప్రాధాన్యతనిస్తుంటారు. ఇందులో భాగంగా చాలామంది సంగీతాన్ని వింటూ వ్యాయామం చేస్తుంటారు. ఇలాంటి వారికి మాత్రం చక్కగా ఉపకరించే ఒక హెడ్‌సెట్‌ను పరిశోధకులు రూపొందించారు. ఈ హెడ్‌సెట్‌తో మీరు పాటలు వింటూ చక్కగా వ్యాయామం చేశారంటే మీరు ఆరోజు ఎన్ని కేలరీలను కరిగించారు? అనే విషయాన్ని ఈ హెడ్‌సెట్‌ చక్కగా లెక్కించి చెప్పేస్తుందట.

ఐరివర్‌ సంస్థ రూపొందించిన ఈ హెడ్‌సెట్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసి అందులో నుండి చక్కగా మీకు నచ్చిన పాటలను వింటూ మీరు జాగింగ్‌ లేదా ఇతర వ్యాయామాలను చేయండి. మీ వ్యాయామం పూర్తయిన తర్వాత సదరు వ్యాయామం ద్వారా మీ శరీరంలో ఎన్ని కేలరీల శక్తి ఖర్చయిందో ఈ హెడ్‌సెట్‌ గుర్తించి చెబుతుందట. అంతేకాదు, మీ గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును దీని ద్వారా తెలుసుకోవచ్చు. మీరు నడుస్తూ లేదా జాగింగ్‌ చేస్తూ ఎంతదూరం ప్రయాణించారో, దానివల్ల ఎన్ని కేలరీలను ఖర్చు చేశారో ఈ హెడ్‌సెట్‌ ద్వారా తెలుసుకోవచ్చట. ఈ వివరాలను హెడ్‌సెట్‌ను అనుసంధానించిన స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు. ఇందులోని ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌, యాక్సిలరోమీటర్లను అమర్చడం వల్ల దీనిద్వారా ఈసీజీతో తీసినంత కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఐరివర్‌ సంస్థ చెబుతోంది. మరింకేం చక్కగా ఈ హెడ్‌సెట్‌ను కొనేసి మీ వ్యాయామం ప్రారంభించేయండి.

  • Loading...

More Telugu News