: హైదరాబాద్ ను పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలి: పనబాక
రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సీమాంధ్రుల భద్రత కోసం హైదరాబాద్ ను పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని మంత్రుల బృందాన్ని కోరినట్టు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. బాపట్ల లోని తన స్వగృహంలో ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అధిష్ఠానం పెద్దలను కోరుతున్నామన్నారు. విభజన తప్పనిసరైతే సీమాంధ్రుల హక్కులను కాపాడి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, సుప్రీంకోర్టు బెంచ్, హైకోర్టు, కోస్టల్ కారిడార్, పన్ను రహిత ఎస్ఈజడ్ లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు వివరించారు. రాజధానిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే దానిపై తమ అభిప్రాయాలను మంత్రుల బృందానికి తెలియజేసినట్టు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి బాపట్ల నుంచే పోటీ చేసి తాడో పేడో తేల్చుకుంటానన్నారు. హైదరాబాద్ అందరిదీ అని దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు.