: ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు: వెంకయ్య నాయుడు
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనేనని భారతీయ జనతా పార్టీ ప్రతి వేదికపైనా ఏదో రూపేణా చాటుతోంది. సీనియర్ నేతలందరూ కూడా మోడీ నామస్మరణలో మునిగితేలుతుండడం ఈ విషయాన్ని బలపరుస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో తన పార్టీని గుజరాత్ లో అందలం ఎక్కించిన తీరు మోడీ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గం ఏకాభిప్రాయనికొచ్చేసింది. దానర్థం వచ్చే ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోనే ముందుకు వెళ్లనున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించినట్టే!
ఈ క్రమంలో బీజేపీ అగ్రనాయకుడు వెంకయ్య నాయుడు కూడా మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజలందరూ మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ కు చుక్కలు చూపిన మోడీ ఇప్పుడు వారికి సింహస్వప్నం అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.