: పొంచి ఉన్న ఆర్టీసీ ఛార్జీల పెంపు!


మూలిగే నక్కపై తాటి పండు పడడం అంటే ఇదేనేమో! చమురు సంస్థలు మరోసారి డీజిల్ ధరలు పెంచడంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెత్తిన పెనుభారం పడ్డట్టైంది. మొన్నటికి మొన్న బల్క్ కొనుగోలు దారులకు షాకిచ్చిన కేంద్రం మరోసారి వారి నడ్డి విరిచే ప్రయత్నం చేసింది. తాజాగా డీజిల్ లీటర్ కు రూ. 1.25 పెంచడంతో ఇప్పడు ఆర్టీసీకి ఎటూపాలుపోని పరిస్థితి ఎదురైంది.

ఇటీవలే సర్ ఛార్జి పేరిట స్వల్పం గా ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మళ్లీ పెంచితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని సందేహిస్తోంది. పెంచకపోతే, ఇప్పటికే పేరుకుపోతున్న అప్పుల భారం నానాటికీ గుదిబండలా మారుతుంది. ప్రస్తుతానికి ఆర్టీసీ రుణభారం రూ. 4000 కోట్లు కాగా, నష్టాలను మొండిగా భరిస్తూ మరింత ఊబిలోకి కూరుకుపోతోందని రవాణా సంస్థ వర్గాలంటున్నాయి.

కేంద్రం సబ్సీడీ కూడా ఎత్తివేయడంతో ఇప్పడు ఆర్టీసీ లీటర్ డీజిల్ కు రూ. 13 రూపాయిలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, బస్సు ఛార్జీలు ఓకేసారి భారీ ఎత్తున పెంచితే.. డీజిల్ రేట్లు ఎన్నిసార్లు పెరిగినా ఇక మాటిమాటికీ సమీక్షించాల్సిన అవసరం ఉండదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అయితే, పైకి పెంపు ఉండకపోవచ్చని ఆర్టీసీ వర్గాలంటున్నా, ఛార్జీల పెంపుతో కొద్దిమేర అయినా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News