: దారుణం బాబోయ్.. 72 గంటల్లో 20 మంది శిశువులు మృతి
కన్న బిడ్డను బతికిస్తారని ఆశగా తీసుకొస్తారు ఆ దవాఖానాకి. కానీ, ప్రాణం పోయడం అక్కడి డాక్టర్ల చేతుల్లో లేదు.. అంతా దైవాధీనం. పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రి చిన్నారుల చావులకు చిరునామాగా మారింది. గత 72 గంటలలో 20 మంది శిశువులు ఇక్కడ ప్రాణం విడిచారు. ఇందులో 24 గంటల్లోనే 10 మంది మరణించడం గమనార్హం. ఈ ఏడాది మే నెలలోనూ ఇదే ఆస్పత్రిలో 16 మంది శిశువులు కన్నుమూశారు.
ఆస్పత్రిలో వసతుల లేమే తమ బిడ్డల ప్రాణాలు తీస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యులు మాత్రం విషమ పరిస్థితుల్లో తీసుకొస్తున్నారని, తామేమీ చేయలేకపోతున్నామని అంటున్నారు. పోషకలేమితో పుట్టిన పిల్లలుగా వారిని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే నెలలో 16 మంది శిశువులు మరణించినప్పుడు నిపుణుల బృందం విచారించి తక్కువ బరువుతో పుట్టడం, పోషకలేమి కారణంగానే మరణించినట్లు తేల్చింది. కారణాలు ఏవైతేనేం చిన్నారుల ఆయువు తీరకుండా చర్యలు తీసుకోవడంలో అక్కడి ప్రభుత్వం పాటిస్తున్న నిర్లక్ష్యం మాత్రం క్షమించరానిది.