: పరస్పర అంగీకారంతో శృంగారానికి కోర్టుల అనుమతి అవసరం లేదు: రేణుకా చౌదరి
శృంగారానికి పరస్పర అంగీకారం ఉంటే మహిళలకు కోర్టుల ఆమోదం అక్కర్లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన యువతులు తమ ఇష్టం మేరకు శృంగారంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కొంతమంది యువతులు మొదట్లో శృంగారానికి అంగీకరించి, తర్వాత అత్యాచారానికి గురయ్యామని ఫిర్యాదులు చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేణుక పైవిధంగా మాట్లాడారు. అత్యాచారానికి, ఆమోద శృంగారానికి మధ్య చాలా తేడా ఉందన్నారు. కోర్టు తీర్పుపై మహిళలు అయోమయానికి లోనుకావద్దని సూచించిన రేణుక, కోర్టు తీర్పుపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని చెప్పారు. అత్యాచారానికి గురైన యువతులు అలా ఫిర్యాదులు చేస్తున్నారనడం సరికాదన్నారు. అత్యాచారం అంటే అత్యాచారమేనని.. అది క్రూరమైనదని, అత్యాచారంలో మహిళ ఆక్రమణకు గురవుతుందని పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో కూడా మహిళలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు.