: ఏకాగ్రతను అలవరచుకోవాలంటే...
మన మనసు ఏకాగ్రతను కలిగివుంటే మనం చేసే పనుల్లో ఎలాంటి పొరబాట్లు దొర్లవు. అదే మనసు ఏకాగ్రత లేకుండా చేసే పనుల్లో బోలెడు తప్పులుంటాయి. అలాగే ఇప్పుడు ఎక్కువమందిని వేధించే సమస్య మతిమరుపు. చిన్న పిల్లలనుండి పెద్దవారి వరకూ ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. ఇలా మతిమరుపుతో బాధపడేవారికి చిన్న చిన్న పనుల వల్ల మరుపు తగ్గి జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది. అదేమంటే తాము చేస్తున్న పనిపై దృష్టి సారించడం అనేది ముఖ్యమైంది.
మనం బ్రష్ చేస్తున్నా, స్నానం చేస్తున్నా, చదువుతున్నా ఇలా మనం ఏ పనిచేస్తున్నా దానిపై దృష్టి పెట్టాలి. దీనివల్ల ఏకాగ్రత అలవడుతుంది. ఇలా ఏకాగ్రతగా చేయడం వల్ల మనం చేసే పనులను సక్రమంగా చేయగలుగుతాం. భోజనం చేస్తూ టీవీ చూడడం, అలాగే వాహనాన్ని నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడడం వంటివి చేయకుండా ఉంటే కొంతమేర ఏకాగ్రత అలవడుతుంది. అలాగే యోగా చేయడం వల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగాలో ముఖ్యంగా వృక్షాసనం, నటరాజాసనం ఈ రెండు ఆసనాలను వేయడం వల్ల ఏకాగ్రత పెరుగడంతోబాటు ముఖ్యంగా పిల్లలు తాము చదివింది మరచిపోకుండా ఉంటారని యోగా నిపుణులు చెబుతున్నారు.