: ఇకనుంచి తెలంగాణ ఇలవేల్పు సోనియానే: మధుయాష్కీ
తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఇకనుంచి టీ-ఇలవేల్పుగా గుర్తుంచుకోవాలని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ కోసం 56 ఏళ్లుగా పోరాటం చేశామన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరుగుతున్న తెలంగాణ జైత్రయాత్ర సభలో పాల్గొన్న యాష్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. అంతకుముందు మాట్లాడిన మంత్రి సుదర్శన్ రెడ్డి.. తెలంగాణకు న్యాయం చేసిన సోనియాకు సీమాంధ్రలో సమాధి కట్టడాన్ని ఖండించారు. అప్పట్లో శ్రీరాంసాగర్ కు నెహ్రూ శంకుస్థాపన చేసి తెలంగాణను ఆధునిక దేవాలయం అన్నారని గుర్తు చేశారు. సభకు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.