: సరిహద్దుల్లో కాల్పులుపై కేంద్రం పాక్ తో చర్చలు జరపాలి: ఒమర్
పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడడం పట్ల జమ్మూకాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దులా తీవ్రంగా స్పందించారు. పాక్ తీరుతో పరిస్థితి నానాటికీ తీవ్రతరమవుతోందని, తక్షణమే కేంద్రం రంగంలోకి దిగి పాక్ తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. శ్రీనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ప్రధాని మన్మోహన్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో న్యూయార్క్ లో చర్చలు జరిపినా కాల్పులు కొనసాగుతుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో అర్థం కావడంలేదన్నారు. మరిన్ని చర్చల ద్వారానే ఇలాంటి సమస్యలు సమసిపోతాయని చెప్పారు.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అతిపెద్ద పురోగతి అని భావిస్తే, ఇప్పుడది కూడా బీటలు వారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ తో ఈ విషయమై గట్టిగా మాట్లాడాలని ఆయన కేంద్రానికి సూచించారు. నియంత్రణ రేఖ వద్ద అలజడులు తమ రాష్ట్రానికి శుభసూచకం కాబోదని అన్నారు.