: ఆ ముగ్గురికి మధ్య పోస్టుమేన్ దిగ్విజయ్ సింగ్: చంద్రబాబు


తన దీక్షకు మద్దతిచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులోని తన నివాసంలో మాట్లాడుతూ.. తాను తెలుగు జాతి కోసం పోరాడానని, అందులో విజయవంతమయ్యానని అన్నారు. దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని విభజనపై పలు సమస్యలపై విస్తృత స్థాయి చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతి అని, తాజాగా బొగ్గు కుంభకోణంలో 194 బొగ్గు క్షేత్రాలను ఇష్టానుసారం కేటాయించడంతో దేశానికి లక్షా 84 వేల కోట్ల నష్టం వచ్చిందని ఆయన మండిపడ్డారు.

బొగ్గు కుంభకోణంపై సీబీఐ 14 ఎఫ్ఐఆర్ లు వేసిందని తెలిపారు. యూపీఏ 159 బొగ్గు గనుల్ని ఆక్షన్ లేకుండా కేటాయించి అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. నిన్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడి ఉంటే ప్రధాని కూడా కుట్రదారేనని, ప్రధాని కూడా అవినీతికి పాల్పడ్డట్టేనని పేర్కొన్నారని గుర్తు చేశారు.

ఒక వైపు ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. మరోవైపు, దీనిపై కేసు సుప్రీంకోర్టులో ఉందని ఆయన అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లన్నీ ఎక్కడో తప్పిపోయాయని పార్లమెంటులో చెప్పిన యూపీఏ నేతలు, సుప్రీంకోర్టుకు ఏకంగా ఫైల్స్ లేవని చెప్పారని గుర్తు చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతూ అవినీతికి పాల్పడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధాని అధీనంలో ఉండే బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన ఫైల్స్ కే రక్షణ లేకుండా చేశారని సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే న్యాయశాఖామంత్రి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. బొగ్గుకుంభకోణంలో ప్రధానే అసలు కుట్రదారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 'బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్ర లేదా?' అని ప్రశ్నించారు. 'లేకుంటే నిరూపించండి' అంటూ సవాలు విసిరారు. అధికార పార్టీ అవినీతిని ప్రోత్సహిస్తూ, అవినీతికి పాల్పడుతూ దేశాన్ని ఎక్కడికి తీసుకెళుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ బ్రోకర్లు, డీలర్లతో నిండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శవం కుళ్లిపోయిన తరువాత కంపు కొట్టక మానదని, అవినీతి కూడా అలాగే బయటపడక మానదని చంద్రబాబు తెలిపారు. యూపీఏ పాలనలో కేంద్రప్రభుత్వం 15 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన లెక్క చెప్పారు. దేశంలో జరిగిన స్కాముల వల్ల రూపాయి విలువ పతనమైపోయిందని అన్నారు. గనులలో అవినీతి జరిగే ఆస్కారముందని తాము ముందుగానే హెచ్చరించామని బాబు గుర్తు చేశారు.

అలాగే 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని గతంలో సూచించినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పంజరంలో చిలకల్లా జగన్, కేసీఆర్ లు చిలుక పలుకులు పలుకుతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సోనియా, జగన్, కేసీఆర్ మధ్య దిగ్విజయ సింగ్ పోస్టుమేన్ లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బ్లాక్ మనీపై స్విట్జర్లాండ్ వివరాలు వెల్లడిస్తానన్నా కేంద్రం స్పందించలేదని ఆయన ఆక్షేపించారు. విదేశాల్లో 75 లక్షల కోట్ల భారతీయ నల్లధనం మూలుగుతోందని, అయినా ప్రధాని చేవచచ్చి ఉన్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలోని 35 మంది మంత్రులు వారి ఆస్తులు వెల్లడించలేక అవస్థలు పడుతున్నారని విమర్శించారు. దేశంలో అభివృద్ధి, పాలన రెండూ లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, సంక్షోభం పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News