: సమ్మె విరమణకు..తాత్కాలిక సమ్మె విరమణకు తేడా లేదు: మంత్రి ఆనం
ఏపీఎన్జీవోలతో చర్చలు ముగిసిన అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మె విరమణకు, తాత్కాలిక సమ్మె విరమణకు తేడాలేదని అన్నారు. తాము తాత్కాలికంగానే సమ్మెను విరమిస్తున్నామని ఏపీఎన్జీవోలు మీడియా ఎదుట చెప్పడం పట్ల ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. తమ 62 రోజుల సమ్మె డిమాండ్ గా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యోగులు కోరారని చెప్పారు. దానికి ముఖ్యమంత్రి, తాను ఇప్పటికే కేంద్రం, పార్టీ అధిష్ఠానం ముందుకు విభజనవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను తీసుకువెళ్ళానని తెలిపారన్నారు. విభజన వల్ల సమస్యలను పెంచినవారమౌతామని తమ పార్టీ హైకమాండ్ కి చెప్పినట్టు సీఎం తెలిపారని ఆనం వెల్లడించారు.
తాను పదవిలో ఉండగా విభజన జరగదని సీఎం హామీ ఇచ్చారని.. ఆయన హామీతో ఏపీఎన్జీవోలు సమ్మె విరమిస్తున్నామని తమకు తెలిపారని చెప్పారు. రేపటి నుంచి ఏపీఎన్జీవోలు విధులకు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.