: స్పీడు ఎక్కువైనందుకు రూ. 80 లక్షల జరిమానా
మనం వేగంగా కారు నడిపితే మహా అయితే రూ. 600 ఫైన్ కడతాం. కానీ ఆండర్స్ విక్లాఫ్ (67) అనే వ్యాపారవేత్త మాత్రం రూ. 80 లక్షలు జరిమానా చెల్లించాడు. స్వీడన్ కు చెందిన ఈ కోటీశ్వరుడికి ఫిన్లాండ్ లోని ఓ కోర్టు ఈ జరిమానా విధించింది. ఫిన్లాండ్ లోని అలాండ్ దీవుల్లో గంటకు 50 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లాల్సిన చోట 77 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లడంతో విక్లాఫ్ కు కోర్టు ఈ భారీ జరిమానా వడ్డించింది. ఫిన్లాండ్ చట్టాల ప్రకారం ఎవరికైనా జరిమానాను వారి ఆస్తిపాస్తులను బట్టి విధిస్తారు. స్వతహాగా ఆయన కోటీశ్వరుడు కావడంతో రూ. 80 లక్షలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. సొంత దేశం స్వీడన్ లో అయితే కేవలం రూ. 38 వేల జరిమానా కడితే సరిపోయేదని ఆ పెద్దమనిషి వాపోయాడు.