: పొగాకునుండి చక్కెర పదార్థాలను తీయవచ్చు
అదేంటి, పొగాకు ప్రాణాంతకం కదా... దీనినుండి చక్కెర పదార్ధాలను ఎలా తీస్తారు? అని మీకు అనుమానంగా ఉందా... జన్యుమార్పిడి జరిగిన పొగాకు మొక్కలనుండి 500 శాతం అధికంగా చక్కెర పదార్ధాలను ఉత్పత్తి చేయవచ్చని, అలాగే ఈ చక్కెర పదార్ధాలనుండి జీవ ఇంధనాలైన బయోఎథనాల్‌ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పొగాకులోని థియోరెడాక్సిన్ అనే ప్రొటీను ద్వారా బయోఫ్యూయెల్‌ను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుమార్పిడి చేసిన పొగాకు మొక్కల ద్వారా ఇది సాధ్యమేనని పొగాకులోని థియోరెడాక్సిన్ అనే ప్రోటీను వల్ల దానిలో పిండిపదార్ధం మోతాదు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నావరె విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
థియోరెడాక్సిన్ ప్రొటీన్‌లో ఎఫ్, ఎం అనే రెండు రకాలుంటాయని, అవి రెండూ ఒకేవిధమైన పనిచేస్తాయని ఇప్పటి వరకూ తాము భావించేవారమని, కానీ ఈ పరిశోధనల్లో రెండు రకాలు ఒకదానికి మరొకటి భిన్నంగా పనిచేస్తాయని తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రోటీన్ల గురించి తెలిసిన కొత్త విషయాల ఆధారంగా జన్యుమార్పిడి చేసిన పొగాకు మొక్కలనుండి 500 శాతం అధికంగా చక్కెర పదార్దాలను ఉత్పత్తి చేసే ప్రక్రియను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ చక్కెర పదార్ధాలను బయోఎథనాల్‌గా మార్చడంలో కూడా శాస్త్రవేత్తలు విజయాన్ని సాధించారు. ఇలా జన్యుమార్పిడి చేసిన ఒక టన్ను పొగాకు నుండి 40 లీటర్ల బయో ఎథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.