: మేకలకు బాలీవుడ్ హీరోల పేర్లు.. ధర లక్షల్లోనే!
బక్రీద్ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున మాంసం కొనుగోలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు ఢిల్లీలోని మాంసం విక్రయదారులు. మేకలకు బాలీవుడ్ హీరోల పేర్లు పెట్టి కాసులు పోగేసుకుంటున్నారు. మందలో బలిష్టంగా ఉండే మేకలను ఎంపిక చేసి వాటికి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అని పేర్లు పెట్టి విక్రయిస్తున్నారు. ప్రజలు కూడా ఈ శ్రేష్ఠమైన మేకల పట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారు.
తింటే ఇలాంటి మేక మాంసమే తినాలని వారు నిశ్చయించుకుని ఎంత ధరైనా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఒక్కో మేక ధర పదిహేను వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పలుకుతుందట. ఇంత ధర ఎందుకుని దుకాణదారులను ప్రశ్నిస్తే.. తాము వీటిని ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ నుంచి దిగుమతి చేసుకుంటామని, ఇవి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, వీటి మాంసం అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు.