: రూ.2,248 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల తిరుపతి దేవస్థానం 2013-14 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ.2,248 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. శనివారం సమావేశమైన పాలకమండలి సమావేశంలో ఈ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అయితే గత సంవత్సరం కంటే ఈ ఏడాది బడ్జెట్ రూ.238 కోట్లు పెంచినట్లు టీటీడీ అధికారులు చెప్పారు.
ఇందులో పలు రాబడులు, వ్యయాలను తెలిపిన అధికారులు ఎక్కడెక్కడి నుంచి రాబడులు వస్తాయో వివరించారు. భక్తుల హుండీ ద్వారా రూ.859 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ రాబడి రూ.555 కోట్లు వస్తాయని తెలిపారు.
వచ్చే రాబడులను చూస్తే.. దర్శనం ద్వారా రాబడి అంచనా రూ.185 కోట్లు, తలనీలాల ద్వారా అంచనా రూ.200 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.150 కోట్లు వస్తాయని వివరించింది. ఇక వ్యయాలు చూస్తే.. ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.350 కోట్లు, టీటీడీ ఉద్యోగుల పింఛన్ల కోసం రూ.120 కోట్లు, పెట్టుబడులు, ఇతర వ్యయాలకోసం రూ.638 కోట్లు కేటాయించింది.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం 18 తలుపులకు బంగారు తాపడం చేయించాలన్నటీటీడీ నిర్ణయానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. అటు రూ.కోటి రూపాయల వ్యయంతో తిరుమలకు బాంబు నిర్వీర్య యంత్రాలను కోనుగోలు చేయాలని కూడా నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది.