: పార్లమెంటులో విభజన ప్రకటన రాజ్యాంగ విరుద్ధం: సోమిరెడ్డి
పార్లమెంటులో నేరుగా విభజన ప్రకటన చేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ ప్రమేయం లేకుండా నేరుగా కేంద్రం తెలంగాణ ప్రకటించడాన్ని తప్పు పట్టారు. తొలుత పార్లమెంటులో విభజన ప్రకటన చేసి తరువాత శాసనసభకు పంపిస్తామనడం తప్పు అని ఆయన హెచ్చరించారు. కేంద్రం వాదన కోర్టులలో కూడా నిలబడదని, సరిదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజాభీష్టాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు, జగన్ కు కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు.
ఎంపీలుగా ఉన్నవారు స్వార్థంతో వ్యక్తిగత ఆస్తులను వెనకేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని, అదెలా సాధ్యమైందని సోమిరెడ్డి ప్రశ్నించారు. 20 వేల శాతం ఆస్తులు ఎలా పెరుగుతాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవినీతిపరులు కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.