: తమిళుల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం: ప్రధాని


శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ (CHOGM) లో పాల్గోనే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మన్మోహన్ తెలిపారు. తమిళ ప్రజల మనోభావాలను కూడా తాము దృష్టిలో ఉంచుకుంటామని అన్నారు. వచ్చే నెలలో కొలంబోలో కామన్వెల్త్ దేశాలకు చెందిన అధినేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు భారత్ తరపున ప్రధాని హాజరుకానున్నారు.

శ్రీలంకలో జరిగే ఈ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరు కాకూడదని డీఎంకేతో పాటు పలు తమిళ సంస్థలు, తమిళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని డీఎంకే సీనియర్ నేత టి.ఆర్.బాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రధాని... కొలంబో సమావేశానికి బయల్దేరే ముందే అన్ని విషయాలను, ముఖ్యంగా తమిళ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని కరుణానిధికి కూడా తెలపాలని బాలుని కోరారు.

కొలంబోలో జరిగే సమావేశానికి ప్రధాని హాజరుకాకూడదని డిమాండ్ చేస్తూ... చెన్నైలో త్యాగరాజన్ అనే తమిళ మద్దతుదారుడు అక్టోబర్ 1 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించింది. త్యాగరాజన్ నిరాహార దీక్ష ముగించేలా ప్రయత్నించాలని బాలుని ప్రధాని మన్మోహన్ కోరారు.

  • Loading...

More Telugu News