: ఈ మందు కంటిపాపను కాపాడుతుంది
వయసు పెరిగిన తర్వాత వచ్చే ప్రధాన సమస్యల్లో చెప్పుకోదగినది దృష్టిలోపం. దీన్ని నివారించడానికి ఒక ప్రత్యేకమైన మందును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వయసు పెరగడంతోబాటు కంటిపాప క్షీణత (ఏఎండీ) సమస్య ఏర్పడుతుంది. దీనికి ప్రత్యేకమైన కంటి చుక్కల మందును వేయడం ద్వారా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏఎండీ ద్వారా వయోధికుల్లో సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టఫ్ట్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్త రాజేంద్రకుమార్ సింగ్ నేతృత్వంలో కొందరు శాస్త్రవేత్తల బృందం పీపీఏడీఎస్‌గా పిలిచే పిరిడాక్సల్ ఫాస్పేట్-6 అజోపెనిల్-2, డైసల్ఫోనిక్ యాసిడ్‌ల మిశ్రమాన్ని ఉపయోగించి తయారుచేసిన మందుతో ఏఎండీ సమస్యను పరిష్కరించవచ్చని గుర్తించారు. చిట్టెలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ మందు చక్కగా ఉపకరిస్తున్నట్టు తేలింది. ఈ మందును కంట్లో వేసుకోవడం ద్వారా కంటిపాప క్షీణత వ్యాధిని నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రై ఏఎండీకి ఇంతవరకూ చికిత్స లేదని, తాము తాజాగా కనుగొన్న ఈ చుక్కల మందు రెండు రకాలైన ఏఎండీల చికిత్సకు ఉపయోగపడుతుందని రాజేంద్రసింద్రకుమార్ సింగ్ చెబుతున్నారు.