: జగన్ దీక్ష లోటస్ పాండ్ కే పరిమితం: సోమిరెడ్డి
చంద్రబాబు ఢిల్లీ దీక్షపై విమర్శలు గుప్పిస్తున్న వైఎస్సార్సీపీకి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. జగన్ దీక్ష లోటస్ పాండ్ కే పరిమితమని ఎద్దేవా చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తెలుగుజాతి కోసం ప్రాణాలర్పిస్తానంటున్నారని, ఆయనేమన్నా పొట్టి శ్రీరాములా..? అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చుని దీక్ష చేసిన వారికి బాబును విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. బాబు ఢిల్లీలో ఎండలోనూ, వర్షంలోనూ దీక్ష కొనసాగించారని సోమిరెడ్డి వివరించారు. జగన్ పిలుపుతో అక్టోబర్ 2న దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు ఆ మర్నాడే దీక్ష విరమించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయిన జగన్ ఆ పార్టీపైనే పోరాడతాననడం హాస్యాస్పదమన్నారు.
ఇక, తెలుగుదేశం కార్యకర్తలు ఢిల్లీకి రైలులో కాక.. బస్సులో వెళతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో టీడీపీ శ్రేణులు ప్రకంపనలు సృష్టించాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి అభ్యున్నతి కోసమే ఉద్భవించిందని ఉద్ఘాటించారు.