: తీరాన్ని తాకిన 'ఫైలిన్'..
పెను తుపాను ఫైలిన్ తీరాన్ని తాకింది. ఈ సమాచారాన్ని అమెరికా వాతావరణ శాఖ వెల్లడించింది. 'ఫైలిన్' గోపాల్ పూర్ దగ్గర సాయంత్రం 6.25కి తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రచండ గాలుల వేగానికి పూరి గుడిసెలు, పాత ఇళ్లు దెబ్బతింటున్నాయి. అంతే కాకుండా, గాలి వేగానికి భారీ వృక్షాలు కూడా కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గాలుల ప్రభావానికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఫైలాన్ ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఇది పెను బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులంటున్నారు. తుపాను ధాటికి దాదాపు 25 సెంటీమీటర్ల వర్షం కురవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఒడిశాలో వర్షాల ధాటికి ఆరుగురు చనిపోయారని సమాచారం.