: మొదలైన తుపాను బీభత్సం
పైలిన్ తుపాను ప్రభావం ఒడిశా తీర ప్రాంత జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. ఈదురుగాలులు, భారీవర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బరంపురం విశ్వవిద్యాలయం, ఐటీఐ రోడ్, హౌసింగ్ బోర్డు కాలనీల్లో చెట్లు కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పైలిన్ తుపాను ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్ పూర్ కు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు చోట్ల విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. తుపాను దృష్ట్యా భువనేశ్వర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను రద్దు చేశారు.