: నన్ను మళ్లీ అరెస్టు చేస్తే భారత్ కలుగజేసుకోవాలి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్
మాల్దీవుల ప్రభుత్వం తనను మరోసారి అరెస్టు చేస్తే భారత్ తో పాటు అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అభ్యర్థించారు. నషీద్ కొద్ది రోజుల కిందటి వరకు మాలెలోని భారత ఎంబసీ కార్యాలయంలో దౌత్యపరమైన ఆశ్రయం పొందారు.
నషీద్ అధికారంలో ఉన్నప్పుడు ఓ న్యాయమూర్తిని అక్రమంగా అదుపులోకి తీసుకునేందుకు సైన్యాన్ని ఉసిగొల్పారని పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. కాగా, గత ఏడాది నషీద్ ను పోలీసు తిరుగుబాటు సాయంతో పదవీచ్యుతుడిని చేసి మహ్మద్ వహీద్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దీంతో, నషీద్ భారత దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందారు.
రెండు సార్లు అరెస్ట్ వారెంట్లు జారీ అయినా తాను భారత ఎంబసీలో ఉన్నానంటూ వాటిని ఆయన తిరస్కరించారు. ఇటీవలే ఎంబసీ నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో మరోసారి భారత్ సాయాన్ని కోరారు. నషీద్ పై ఆరోపణలు రుజువైతే ఈ మాజీ అధ్యక్షుడు ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హుడువుతాడు.