: గుర్తుంచుకోవడం ఎందుకు దండగ... గూగుల్ ఉండగా...!
మనకు ఏదైనా విషయానికి సంబంధించిన సమాచారం కావాలనుకుంటే మనం వెంటనే చేసే సని నెట్టింట్లో వాలిపోవడం... గూగుల్‌ను అడిగేయడం. దీంతో విషయపరిజ్ఞానం పెంచుకోవడంపై యువత ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మనలో చాలామంది ఏ విషయానికి సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ సెర్చింజన్‌లోకి వెళతారు. ఇలాంటి అలవాటువల్ల క్రమేపీ మతిమరుపు కూడా వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మనకు కోరిన సమాచారాన్ని మన ముందుంచే గూగుల్ వల్ల మనవారికి ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం క్రమేపీ తగ్గిపోతోందట. దీంతో మతిమరుపు కలిగిన వ్యక్తులుగా తయారవుతున్నారట. ఇంటర్నెట్‌ను బాగా ఉపయోగించే సుమారు రెండు వేలమంది యువతీ యువకులపై జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు ఏ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికైనా గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారట. దీంతో వీరు క్రమేపీ గజనీలుగా మారుతున్నారని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
మనకు కోరిన సమాచారాన్ని మన కళ్లముందుంచే గూగుల్ అందుబాటులో ఉండడంవల్ల ఏ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనే భావనకు యువత వస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ట్విన్ టవర్స్‌పై తీవ్రవాదుల దాడులు ఎప్పుడు జరిగాయి, బెర్లిన్ వాల్ ఎప్పుడు కూలింది? వంటి చారిత్రక సంఘటనలకు సంబంధించి వివరాలను కూడా యువతీ యువకులు చాలామంది మరచిపోయారని, అవసరమైనప్పుడు గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారని, ఈ కారణంగా వారిలో మతిమరుపు పెరుగుతోందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.